తిరుపతి: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున ఉదయం 8 గంటలకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ముందుకు నడిచారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్య వంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని, ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు చెప్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు కటాక్షించారు.
భూత వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు సోమవారం ఉదయం శ్రీ సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. అనంతరం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ సోమ స్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.