అమరావతి :
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ విషయం ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో లోకేష్ ది కీలక పాత్ర కాబోతోంది. రెడ్ బుక్ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది అధికారులు తమ పరిధి, స్థాయి మరిచి వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు పెట్టడంతోపాటు అక్రమ అరెస్ట్‌ల పర్వాన్ని యథేచ్చగా కొనసాగించారు. వారిని వదిలిపెట్టేది లేదని, అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని నారా లోకేష్ హెచ్చరించారు. తాజాగా నారా లోకేష్ దీనిపై స్పందించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై 26 తప్పుడు కేసులు పెట్టారని, ఈ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టనని లోకేశ్ చెప్పారు. నేరం చేస్తే శిక్ష ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని.. కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు అట్రాసిటీతో పాటు ఎన్నో కేసులు పెట్టారని మండిపడ్డారు. రెడ్ బుక్ తాను అనుకున్న దానికంటే చాలా పాపులర్ అయిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు