* ఏర్పాట్ల పర్యవేక్షణకు ఇద్దరు ప్రత్యేక అధికారుల నియామకం
హైదరాబాద్ :
కొండగట్టు హనుమాన్ దేవాలయంలో జూన్ 1వ తేదీన జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను దేవాదాయ కమీషనర్ హనుమంత రావు సంబంధిత అధికారులతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయంలో జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. ఎండోమెంట్ శాఖ డిప్యూటీ కమిషనర్లు రామకృష్ణ, వినోద్ రెడ్డి లను ఉత్సవాల ఏర్పాట్ల కోసం స్వయంగా పర్యవేక్షించేందుకు భాద్యతలు అప్పగించారు.
కొండగట్టు జాతరకు ప్రతి సంవత్సరం లక్షలాది హనుమాన్ భక్తులు హాజరవుతారు, ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా టార్పాలిన్ కార్పెట్లు, మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక క్యూలైన్లు, త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, మొబైల్ టాయిలెట్లు, ప్రత్యేక మెడికల్ అంబులెన్సులు, ప్రసాదం కౌంటర్ల వద్ద తగు సిబ్బందిని నియమించడం, పోలీస్ భద్రతా, భక్తులకు పార్కింగ్ సదుపాయం, తదితర ఏర్పాట్ల పై దేవాదాయ కమీషనర్ హనుమంత రావు బుధవారం సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. రాష్టంలో వివిధ ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని తగు సంఖ్యలో ఆర్టీసి బస్సులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ జాతరలో పాల్గొనే ముఖ్యలకు, ప్రజాప్రతినిధులకు, భద్రత సౌకర్యం ఏర్పాటు చేసున్నారు. ఏలాంటి అవాంచనీయ సంఘటనలకు అస్కారం లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Post Views: 43