కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు: ఠాక్రే

 

హైదరాబాద్ :

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే స్పందించారు. కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాటలకు కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్ ఇన్​ఛార్జ్​లుగా ఉన్నవారిని మార్చాల్సి ఉంటుందని హెచ్చరించారు.

తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే వివరణ ఇచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని, పార్టీ లైన్​లోనే ఉన్నారని ఠాక్రే తెలిపారు. వరంగల్​ సభలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలకు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా గెలిచే సత్తా ఉంది

కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని ఏఐసీసీ ఇన్​ఛార్జ్ మాణిక్​రావు ఠాక్రే పేర్కొన్నారు. రాష్ట్ర నేతలంతా త్వరలోనే పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి భువనగిరి పార్లమెంట్​ నియోజక వర్గంలో హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్ర చేస్తారని వివరించారు. ఎయిర్‌ పోర్టులో, తనను రెండు సార్లు కలిసి తాను వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వివరణ ఇచ్చినట్లు ఠాక్రే తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా గెలిచే సత్తా ఉందని మాణిక్​రావు ఠాక్రే స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో పొత్తులు ఉండవని పునరుద్ఘాటించారు. నాయకులు అంతా ఐక్యంగానే ఉన్నారని, కలిసికట్టుగా పని చేస్తారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే వెల్లడించారు.

పని చేయలేని వారికి పదవులు ఎందుకు

పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్ ఇన్​ఛార్జ్​లుగా ఉన్నవారిని మార్చాల్సి ఉంటుందని మాణిక్​రావు ఠాక్రే హెచ్చరించారు. గాంధీభవన్​లో ఇవాళ ఉదయం టీపీపీసీ ఉపాధ్యక్షులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 34 మంది టీపీపీసీ ఉపాధ్యక్షులకు గాను కేవలం 9 మంది మాత్రమే హాజరయ్యారు. ఠాక్రేతో సమీక్షకు 25 మంది టీపీసీసీ ఉపాధ్యక్షులు హాజరుకాలేదు. పీసీసీ ఉపాధ్యాక్షులు గైర్హాజరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి పని చేయలేని వారికి పదవులు ఎందుకని తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎందుకు హాజరుకాలేదో వివరణ అడగాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్​రెడ్డికి సూచించారు.

పార్టీకి సమయం కేటాయించని వారు ఎంతటి వారైనా అవసరం లేదు

17 పార్లమెంట్‌ నియోజక వర్గాల పరిధిలో ఇన్‌ఛార్జ్‌లు తప్పకుండా పర్యటించి జోడో యాత్రపై నివేదికలు ఇవ్వాలని మాణిక్​రావు ఠాక్రే ఆదేశించారు. ఎల్లుండి మరొకసారి ఉపాధ్యక్షుల సమావేశం నిర్వహించాలని, హాజరు కాని వారందరిని తిరిగి పిలువాలని సూచించారు. తాను కూడా త్వరలో పార్లమెంటు నియోజక వర్గాలల్లో పర్యటిస్తానని ఈ నెల 28వ తేదీన భువనగిరి, మార్చి 1వ తేదీన నల్గొండ, 2వ తేదీన ఖమ్మంలో పర్యటించనున్నట్లు వివరించారు. ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు సక్రమంగా నిర్వహించనట్లయితే తక్షణమే వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని, పార్టీకి సమయం కేటాయించని వారు ఎంతటి వారైనా అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కొందరు ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా ఇంకోసారి మాట్లాడదామని సర్ది చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest