జైపూర్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మధ్యాహ్నం ఆయన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అడుగుపెట్టారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, సీఎం భజన్‌లాల్ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. శుక్రవారం దిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న విషయం తెలిసిందే.
గణతంత్ర కవాతుకు భారీ బందోబస్తు : జైపుర్ సమీపంలోని ఆమెర్ కోటను మెక్రాన్ సందర్శించనున్నట్లు సమాచారం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపుపొందిన ‘జంతర్ మంతర్’ వద్దకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనతో కలిసి రానున్నారు. అనంతరం అక్కడినుంచి సంగనేరి గేట్ వరకు వీరిద్దరూ రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యలో హవా మహల్ వద్ద జైపుర్ స్పెషల్ మసాలా చాయ్ ఆస్వాదించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే యూపీఐ చెల్లింపుల ద్వారా హస్త కళాకృతులు కొనుగోలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాంబాగ్ ప్యాలెస్‌లో మెక్రాన్ కోసం ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు. గణతంత్ర వేడుకలకు తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించగా, వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేనని బైడెన్ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. గతేడాది జులైలో పారిస్‌లో నిర్వహించిన ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ ‘బాస్టిల్ డే’ పరేడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.