గాంధీజీ 150వ జయంతి.. సాక్షి కార్టూన్‌కు ప్రతిష్టాత్మక ప్రెస్ కౌన్సిల్‌ జాతీయ అవార్డు

హైదరాబాద్

మహాత్మా గాంధీజీ 150వ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్‌ 2న సాక్షి దినపత్రికలో ప్రచురించిన బాపు కార్టూన్‌ను ప్రతిష్టాత్మక ప్రెస్‌ కౌన్సిల్‌ జాతీయ అవార్డు వరించింది. సాక్షి దినపత్రిక చీఫ్ కార్టూనిస్టు శంకర్‌ ఈ కారికేచర్‌ను గీశారు. ‘భారత భాగ్య విధాతా!’ పేరుతో బాపు బొమ్మను ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమానికి అద్దం పట్టేలా చిత్రీకరించారు. బక్కపల్చటి గాంధీ రూపానికి సమున్నత స్వాతంత్య్ర ఆకాంక్షను కలిపి స్వేచ్ఛాభారతం కోసం మరికొందరు నాయకులతో వేస్తున్న అడుగులను ఈ కారికేచర్‌లో శంకర్‌ తీర్చిదిద్దారు.
“ఐదున్నర అడుగుల ఆ రూపం ఈ దేశానికి చెక్కు చెదరని ప్రతిరూపం అయ్యింది. ఆ పెదాల మీది బోసినవ్వు బ్రిటీష్‌ సామ్రాజ్యాన్నే హడలెత్తించగలిగింది. ఆయన వేసిన ప్రతి అడుగూ చెదిరి ఉన్న మతాలను, జాతులను, భాషలను, సంస్కృతులను ఒక్క చోటుకు చేర్చగలిగింది. సమస్త భారతీయుల దీక్షను చేతికర్రగా ధరించి ఆయన ఈ దేశాన్ని స్వతంత్ర భారతదేశం చేశారు. దేశీయతను భారతీయతగా మలిచారు. ప్రజలను జాతిగా సంఘటితం చేశారు. మొలన ఉన్న గడియారంలోని పెద్దముల్లు లక్ష్యంగా, చిన్నముల్లు కర్తవ్యంగా ఆయన చేసినది మహా పరిశ్రమ. ఆయన కప్పుకున్న ధవళ వస్త్రం స్వచ్ఛతకు చిహ్నం. ఆయన అహింసను గెలిచే ఆయుధం లేదు. ఆయన సత్యాగ్రహాన్ని ఓడించేదే లేదు. తన సులోచనాలతో అనునిత్యం దర్శించినది ఒకే ఒక స్వప్నం”
స్వేచ్ఛాభారతం.. సహన భారతం..
జ్ఞాన భారతం.. ఆధ్యాత్మిక భారతం..
సాక్షి ప్రచురించిన భారత భాగ్య విధాత ప్రజంటేషన్‌ను బెస్ట్‌ న్యూస్‌పేపర్‌ ఆర్ట్‌ : కవరింగ్‌ కార్టూన్స్‌, కారికేచర్స్‌ అండ్‌ ఇల్లస్ట్రేషన్‌ కేటగిరీ కింద ‘నేషనల్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ జర్నలిజం 2020’కి గాను ప్రెస్‌ కౌన్సిల్‌ ప్రకటించింది.
ఈ అవార్డు ఒక్క సాక్షి మీడియా గ్రూపుదే కాదు.. సాక్షిని ఆదరిస్తున్న పాఠకులు, అభిమానిస్తున్న సాక్షి కుటుంబానిది.
ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest