హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మహేందర్‌రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా విశ్రాంత ఐఏఎస్ అనితా రాజేంద్రన్, అమీరుల్లా ఖాన్, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, రామ్మోహన్‌రావు, పాల్వాయి రజనీకుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఛైర్మన్ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించారు. దీంతో ఛైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్ పదవి కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా చివరికి మహేందర్‌రెడ్డిని ప్రభుత్వం ఖరారు చేస్తూ దస్త్రాన్ని గవర్నర్‌కు పంపగా ఆమె ఆమోదం తెలిపారు.
మహేందర్ రెడ్డి గురించి క్లుప్తంగా
1986 బ్యాచ్‌కి చెందిన మహేందర్‌రెడ్డి స్వస్థలం ఉమ్మడి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన ఏకోపాధ్యాయ పాఠశాలలోనే చదువుకున్నారు. రామగుండం ఏఎస్పీగా తొలుత బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూలు ఎస్పీగా పనిచేశారు. ఐదేళ్లపాటు జాతీయ పోలీసు అకాడమీలో బాధ్యతలు నిర్వహించిన ఆయన చంద్రబాబునాయుడు హయాంలో ఏర్పాటు చేసిన సైబరాబాద్ కమిషనరేట్‌కు మొదటి కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇక్కడ ఆయన పోలీసుశాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మూడేళ్లపాటు సుదీర్ఘంగా సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత గ్రేహౌండ్స్, పోలీసు కంప్యూటర్స్ విభాగాల్లో విధులు నిర్వహించారు. కీలకమైన నిఘా విభాగాధిపతిగానూ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత హైదరాబాద్ కమిషనర్‌గా నియమితులయ్యారు. స్నేహపూర్వక పోలీసింగ్ పేరుతో అనేక ప్రయోగాలు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడంలో విశేష కృషిచేశారు. అనంతరం 2017 నవంబర్‌లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి 2022 డిసెంబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు.