డ్రీమ్స్ అన్ లిమిటెడ్ – గ్రహణం మొర్రితో భాదపడిన పిల్లలకు సాధికారత చేకూర్చే స్మైల్ ట్రైన్ స్వచ్ఛంద సంస్థ వారి వేదిక
హైదరాబాద్
బసవతారకం స్మైల్ ట్రైన్ వారు గ్రహణం మొర్రి తో భాదపడుతున్న చిన్నారుల ప్రతిభను వెలికి తీసి, వారిలో ఆత్మ విశ్వాసం నెలకొల్పడం ద్వారా వారిలోని కలలకు రూపం కలిపించే కార్యక్రమం
బసవతారకం స్మైల్ ట్రైన్ సంస్థ వారు గ్రహణం మొర్రితో ఇబ్బందిపడుతున్న చిన్నారుల కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థ. బసవతారకం స్మైల్ ట్రైన్ వారు హైదరాబాదు లో చిన్నారుల కోసం నాలుగు రోజుల పాటూ థియేటర్ వర్క్ షాపును నిర్వహించారు. డ్రీమ్స్ అన్ లిమిటెడ్ పేరుతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరయు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆవరణలో నిర్వహించబడిన ఈ వర్క్ షాపులో గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులలోని ప్రతిభను వెలికి తీసి వారి కలలకు రూపం కలిగించే ప్రయత్నం చేశారు. గ్రహణం మొర్రి లేదా చీలిక పెదవి మరియు అంగిలి తో భాదపడుతున్న చిన్నారులు ఎన్నో ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొంటారు. వారి వారి భావాలను ప్రకటించడానికి సతమతమవుతూ సమాజంలో వివక్షకు గురవుతుంటారు. వీరిలో మాట్లాడడం, సరిగ్గా పలకగలగడం, సరైన బాడీ లాంగ్వేజ్ తో భావాలను వ్యక్తీకరించడం మరియు వ్యక్తిత్వ వికాసం వంటివి పెంపొందించడానికి నిర్వహించిన వర్క్ షాపులో 25 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. డ్రీమ్స్ అన్ లిమిటెడ్ పేరుతో తయారు చేయబడ్డ డ్రామా ద్వారా చిన్నారులు తమ తమ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా ప్రపంచంలోని సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం నేర్చుకొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అబిజిత్ కొంపి, రెగ్యులేటరీ పోర్ట్ ఫోలియో & ప్రయారిటైజైషన్ డైరెక్టర్, R&D లీడ్, హాలియాన్ ఇండియా వారు మాట్లాడుతూ చిన్నారులలో ఆత్మ విశ్వాసం నింపడానికి బసవతారకం స్మైల్ ట్రైన్ వారు చేసిన ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం అన్నారు. తద్వారా ఆత్మన్యూనత తో భాదపడుతున్న వారు తమ తమ భావాలను మరింత ధైర్యంగా వ్యక్తీకరించగలుగుతారని అభిప్రాయపడ్డారు. అనంతరం డా. డి ముకుంద రెడ్డి, ప్రొఫెసర్ – ప్లాస్టిక్ సర్జరీ మరియు ప్రాజెక్టు డైరెక్టర్, బసవతారకం స్మైల్ ట్రైన్ వారు మాట్లాడుతూ గ్రహణం మొర్రితో భాదపడుతున్న చిన్నారులు సమాజంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొంటూ ఇప్పటికే జీవితంలో పలు యుద్దాలను చేసి వచ్చిన వారన్నారు. ఇలాంటి థియేటర్ వర్క్ షాపుల ద్వారా వారి వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఎన్నో మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలరన్నారు. కార్యక్రమంలో ముందుగా మమత కరోల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , రీజనల్ డైరెక్టర్ – ఆసియా, స్మైల్ ట్రైన్ వారు మాట్లాడుతూ గ్రహణం మొర్రి అనేది పై పెదవి లేదా నోటి పై భాగంలో పుట్టినపుడు ఏర్పడే శారీరక లోపమని వివరించారు. 770 మంది చిన్నారులల ఒకరికి వచ్చే ఈ ఇబ్బంది చిన్నారులలో ముఖంలో పలు మార్పులకు కారణం కావడమే కాకుండా వారిలో తినడానికి, గాలి పీల్చడానికి, వినడానికి, మాట్లడడానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందన్నారు. వీరు సమాజంలో ఒంటరి వారై వివక్షకు గురవుతున్నారని వివరించారు. అనంతరం కార్యక్రమంలో శిక్షణ పొందిన చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ అబిజిత్ కొంపి, రెగ్యులేటరీ పోర్ట్ ఫోలియో & ప్రయారిటైజైషన్ డైరెక్టర్, R&D లీడ్, హాలియాన్ ఇండియా – డా. డి ముకుంద రెడ్డి, ప్రొఫెసర్ – ప్లాస్టిక్ సర్జరీ మరియు ప్రాజెక్టు డైరెక్టర్, బసవతారకం స్మైల్ ట్రైన్ – మమత కరోల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు రీజనల్ డైరెక్టర్ – ఆసియా, స్మైల్ ట్రైన్ లతో పాటూ మిస్ అర్చనా సురేష్, డైరెక్టర్, తెలంగాణా సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, పరిశ్రమల విభాగం, తెలంగాణా ప్రభుత్వం – డా. బసంత్ కుమార్ రాయని, హెడ్, అనస్థీషియా విభాగం, BIACH&RI తో పాటూ డా. కె వి వి యన్ రాజు, సర్జికల్ ఆంకాలజిస్టు, BIACH&RI మరియు డా విభావరి నాయక్, అనస్థీషియాలజిస్టు, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, దాతలు పాల్గొన్నారు.