దళిత క్రైస్తవులకు రాజకీయ అవకాశాలు

 

  • లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్న సీఎం కేసీఆర్
  • దేశంలో గగ్గోలు పరిస్థితులు ఉంటే… తెలంగాణలో ఒక్క మతకల్లోలం జరగలేదు
  • దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం లో కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

హైదరాబాద్ :

రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు సీఎం కేసీఆర్ రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నారని, రానున్న రోజుల్లో సమయం సందర్భాన్ని బట్టి మరింత మందికి అవకాశాలు కల్పిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సీఎం కేసీఆర్ లౌకిక స్వరూపాన్ని కాపాడుతున్నారని, శాంతిసామరస్యాలతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని నమ్ముతారని తెలిపారు.

సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీలో టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ప్రముఖ క్రైస్తవ మతపెద్దలు రసలం మోడరేటర్ రేవరెండ్ ఏ ధర్మరాజ్, మెదక్ బిషప్ రెవరెండ్ కే పద్మా రావు, ఈస్ట్ కేరళ బిషప్ రెవరెండ్ వీ ఎస్ ఫ్రాన్సిస్, కర్ణాటక బిషప్ రెవరెండ్ హేమచంద్ర కుమార్, తమిళనాడు ఐసీఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రెవరెండ్ ఎమ్మెస్ మార్టిన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ….సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి అని, కులాలు, మతాలు ఉన్నవాడు, లేనివాడు అన్న పేద భావాలు లేకుండా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు.

దేశంలో గగ్గోలు పరిస్థితి నెలకొన్న సందర్భంలో గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఒక్క మతకల్లోలం కూడా జరగలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలకు కేసిఆర్ తీసుకున్న చర్యల పట్ల అందరూ గర్వపడాలని అన్నారు. గంగా జమున తహసీబ్ తరహాలో అందరూ కలిసిమెలిసి జీవించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతుందని నమ్మే వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.

అన్ని మతాల పండుగలను రాష్ట్రంలో సంతోషంగా జరుపుకుంటున్నామని, బతుకమ్మ బోనాలు రంజాన్ క్రిస్మస్ వంటి పండగలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వివరించారు.

సీఎం కేసీఆర్ పట్టు వదలని వ్యక్తి అని, 2001లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నాడు ఉద్యమాన్ని వదిలి పక్కదారి పడితే తనను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిన పట్టుదల మనిషి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అంత నిబద్ధత ఉంది కాబట్టే అప్పుడున్న రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో క్రైస్తవ సోదరుల పాత్ర మర్చిపోలేమని అన్నారు. రాష్ట్ర సాధన కోసం శాంతియాత్రలు చేసి చర్చలను బందు పెట్టి పోరాటం చేశారని కొనియాడారు. క్రైస్తవుల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించారని, రాజకీయంగా కూడా దళిత క్రైస్తవులందరికీ అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. సమయం, సందర్భాన్ని బట్టి మరింత మంది కూడా రాజకీయ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఐక్యంగా ఉండి రాజకీయ అధికారాన్ని సాధించుకోవడానికి ఓపిక అవసరమని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు,ఎపి బిఅరెస్ నాయకుడు రావెల కిషోర్ బాబు,
బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు రాజారత్నం అంబేడ్కర్ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్,ఎర్రోళ్ల శ్రీనివాస్,గజ్జెల నగేష్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest