- అమెరికా మాజీ అధ్యక్షుడికి వరుసగా రెండో విజయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌నకు వరుసగా రెండో విజయం లభించింది. గత వారం అయోవా రాష్ట్ర ప్రైమరీలో విజేతగా నిలిచిన ఆయన తాజాగా న్యూ హ్యాంప్‌షైర్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ప్రైమరీలో తన సమీప ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన నిక్కీ హెలీని ట్రంప్ ఓడించారు. నిక్కీకి మద్దతుగా నమోదైన ఓట్ల శాతం గణనీయంగా పెరగడం గమనార్హం. ప్రైమరీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఓటమి ఎదురైనప్పటికీ పార్టీ అభ్యర్థి ఖరారు పోరు నుంచి వైదొలగబోనని ఆమె స్పష్టంచేశారు. తొలుత ఈ పోటీలో 14 మంది నిలిచారని, ఇప్పుడు ట్రంప్ తర్వాత స్థానంలో ఉన్నది తానేనని నిక్కీ హెలీ తెలిపారు. ట్రంప్ అభ్యర్థిత్వానికి మార్గం సుగమం చేస్తూ పోటీ నుంచి వైదొలగాలన్న వివేక్ రామస్వామి వంటి వారి డిమాండ్లను ఆమె తోసిపుచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అయితే డెమోక్రాట్ల చేతిలో ఓటమి తప్పదని నిక్కీ హెచ్చరించారు. బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయం సులభమవుతుందని పేర్కొన్నారు. డెమోక్రాట్లను ఓడించాలంటే రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థినిగా తానే ఉండాలని స్పష్టంచేశారు. తదుపరి ప్రైమరీ ఎన్నికలు జరిగే సౌత్ కరోలినాలో గెలుపు తనదేనన్న భరోసాతో నిక్కీ ఉన్నారు. అది ఆమె సొంత రాష్ట్రం. ఆ రాష్ట్ర గవర్నర్‌గా రెండు దఫాలు ఎన్నికయ్యారు. తనపై పరుష వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ మానసిక ఆరోగ్యంపై నిక్కీ సందేహాలు వ్యక్తం చేశారు. తనతో ప్రత్యక్ష చర్చకు సిద్ధం కావాలంటూ మాజీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు.