పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు

 

గుంటూరు  :

పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, వైసీపీ వర్గీయులపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. దాడులు, ఘర్షణలకు సంబంధించిన వీడియోల సాయంతో నిందితులను గుర్తిస్తున్నారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం కార్యకర్తల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణల సమయంలో తమ వారు అక్కడ లేపోయినా అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో 100 కేసులు నమోదు చేసి 192 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. దాచేపల్లి మండలంలో 70, పిడుగురాళ్ల మండలంలో 62 మందిపై కేసులు పెట్టారు. మరో 67మందిపై ఐపీసీ 307, 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సత్తెనపల్లి నియోజక వర్గంలో 34 కేసులు 70 మంది నిందితులను గుర్తించారు.పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు కేసులు, 99 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు నమోదు చేసి 60 మందిని నిందితులుగా చేర్చారు. మరో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాచర్లలో అత్యధికంగా హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ కేసుల విషయంలో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో ఈనెల 14న జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలకు సంబంధించి అరెస్టులు మొదలయ్యాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కారంపూడిలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. కొన్ని వాహనాలను తగులబెట్టారు. ప్రతి చర్యగా టీడీపీ వర్గీయులు రోడ్లపైకి వచ్చి వైకాపాకు చెందిన వారి ఆస్తులపై దాడులు చేశారు. ఈ రెండు ఘటనలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వైసీపీకి చెందిన 11 మందిని, టీడీపీకి చెందిన 8మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest