బండి సంజయ్ ను తప్పించడం బీసీల నాయకత్వాన్ని బీజేపీ వంచించడమే!

  • బీసీల నాయకత్వం అగ్రవర్ణ పార్టీలను అందలం ఎక్కించడానికేనా? పరిపాలించడానికి మేము పనికిరామా ?
  • బీసీలకు చట్టసభల్లో అవకాశం ఇవ్వని ప్రధాని మోదీ బీసీ అంటే నమ్మేదెలా..
  • దాసు సురేశ్ , అధ్యక్షులు -బీసీ రాజ్యాధికార సమితి

హైదరాబాద్

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం కావడానికి శాయశక్తుల సహకరించిన బీసీ వర్గాలను, యువతను వంచిస్తూ పార్టీ అధ్యక్షునిగా ప్రాతినిధ్యం వహించిన బండి సంజయ్ (బీసీ) ను రాష్ట్ర అధ్యక్షడి స్థానం నుండి తప్పించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తీవ్రంగా ఖండించారు. బీసీల నాయకత్వం అగ్రవర్ణ పార్టీల నిర్మాణానికే పరిమితం తప్ప ప్రజలను పరిపాలించడానికి తాము పనికిరామా అని ఎద్దేవా చేశారు..

త్వరలో తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీ ఈ రాష్ట్ర బీసీల ఆకాంక్షలను అర్ధం చేసుకోవాలని దాసు సురేశ్ తెలిపారు .. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని కారణంగా అసెంబ్లీ పార్లమెంటులలో బీసీలు అడుగు పెట్టడం లేకపోతున్న విషయం ప్రధానికి తెలిసినా అందుకు అవసరమైన ఒక చిన్న రాజ్యాంగ సవరణను పార్లమెంటు సాక్షిగా తన తొమ్మిదేళ్ల పరిపాలనలో చేపట్టకపోవడం చూస్తే బీసీ ప్రధాని అయిన మోదీ పై అగ్రవర్ణాల ఆంక్షలు స్పష్టంగా అగుపిస్తున్నాయని దాసు సురేశ్ తెలిపారు. 75 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అవకాశానికి నోచుకోని బీసీల పట్ల బీజేపీ అగ్ర నాయకత్వానికి , ప్రధాని మోదీకి సానుభూతి లేకపోవడం విచారకరమన్నారు. బీసీల నాయకత్వంపై అగ్రవర్ణ పార్టీలకు నిబద్ధత లేదా అని ప్రశ్నించారు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాలకోసం అట్టడుగు వర్గాలను వంచించడం సరికాదన్నారు.. ప్రధాని పర్యటన రీత్యా ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం తగదన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన , ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తూ పేద వర్గాలను అణగదొక్కడం సరికాదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు ప్రకటించిన లక్ష ఆర్థిసాయ పథకం అశాస్త్రీయంగా ఉందన్నారు. ఈ పథకానికై కేవలం 100 కోట్లు కేటాయించి సహాయాన్నికేవలం పదివేల మందికి మాత్రమే పరిమితం చేయడం తగదన్నారు . ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైన 45 లక్షల బీసీ కుటుంబాలకు ఈ సహాయం ఏ మేరకు సరిపోతుందో తెలపాలన్నారు..ఇది ముమ్మాటికి బీసీలను మోసగించడమేనన్నారు .దళిత బందుకులేని నిబంధనలను బీసీ కులవృత్తుల లక్ష పథకంలో ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నించారు. 152 కులాలుగా ఉన్న బీసీలలో కేవలం 14 కులాలకు మాత్రమే లక్ష ఆర్థిక సాయం ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు.దళిత బంధు తరహాలో బీసీలకు సైతం 10 లక్షల పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో శృంగభంగం తప్పదన్నారు .. కొనసాగుతున్న అగ్రవర్ణ పార్టీల ఆగడాలను అడ్డుకోవడానికి ,తెలంగాణలో బీసీల పక్షాన నిలిచేందుకు త్వరలోనే ప్రత్యేక పార్టీ ప్రజల ముందుకు రానుందని తెలిపారు.

సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షుడు దొంత ఆనందం, కార్యదర్శి మామిళ్ళ సుధాకర్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధి ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబా, పొదిల రాజు, చేపూరి ఓదెల యాదవ్, బొమ్మ నరేందర్ కోణం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest