న్యూఢిల్లీ :
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వాన పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట టిడిపి నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వియ్ వాంట్ జస్టిస్, సేవ్ ఆంధ్రప్రదేశ్ – సేవ్ డెమోక్రసీ, చంద్రబాబుపై తప్పుడు కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, చంద్రబాబునాయుడును బేషరతుగా విడుదల చేయాలని, అంబేద్కర్ రాజ్యాంగం కావాలి, రాజారెడ్డి రాజ్యాంగం వద్దని, ఎపిలో గూండాల రాజ్యం నశించాలని, అక్రమ నిర్బంధాలను ఆపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఎంపిలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎంపిలు నిమ్మల కిష్టప్ప, బికె పార్థసారధి, కొనకళ్ల నారాయణ, కాల్వ శ్రీనివాసులు, మురళీమోహన్, కంభంపాటి రామ్మోహన్ రావు, విశాఖపట్నానికి చెందిన సీనియర్ నేత భరత్ తదితరులు పాల్గొన్నారు.