బాబు పర్యటనను అడ్డుకున్న పోలీస్ -పవన్ గరం గరం

అమరావతి

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకు? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదని చెప్పారు.
ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదని, ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారన్నారు. సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియచేస్తోందన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుని అడ్డుకొనేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటి? ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూశాం గానీ… విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని తెలిపారు. సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని అన్నారు. జనవాణి కార్యక్రమం కోసం నేను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారని చెప్పారు. ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి, బాధితులను పలకరించేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని, నడుస్తుంటే నడవకూడదని ఆంక్షలుపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళను సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే ఈ పాలకులకు జీర్ణం కావడం లేదని ఆయన అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest