- కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం
- మేం ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళతాం
- బీఆరెస్ కు మిగిలింది మరో 99 రోజులే
- బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం వేర్వేరు కాదు… అంతా ఒక్కటే
- 100 శాతం ధరణిని రద్దు చేసి తీరతాం
- ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్
విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలతో బీఆరెస్ నేతలు కకావికాలం అవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేం ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళతామని గతంలో ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ నెరవేర్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తన స్వప్నం అని నిన్న సభలో సోనియా చెప్పారన్నారు. సోమవారం గాందీభవన్లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విజయభేరి సభలో సోనియాగాంధీ గారు ఆరు గ్యారంటీలను ప్రకటించారని వందరోజుల్లో ఈ గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
“విజయభేరిలో ప్రకటించిన విధంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెల రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించనున్నాం. రైతు భరోసా ద్వారా రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15000, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12000 అందిస్తాం. గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విత్యుత్ అందించనున్నాం. ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందించనున్నాం. యువ వికాసం ద్వారా చదువుకునే విద్యార్థులకు రూ.5లక్షల వరకు సాయం అందించనున్నాం చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఆరోగ్యబీమా అందించనున్నాం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ చూసి నిర్ణయం మీరే తీసుకోవాలని ప్రజలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య తేడాలని గమనించాలని రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు పోడు భూముల పట్టాలు,ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసి చూపించామన్నారు రేవంత్ రెడ్డి. కానీ అందుకు భిన్నంగా నల్లధనం తెస్తామని ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం…దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు.. అంటూ ఇక్కడ కేసీఆర్ మోసం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
“2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు..తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ పెట్టండి. ఎవరు మాట తప్పారో.. ఎవరు అమలు చేశారో తెలుస్తుంది” అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.
బీఆరెస్ కు ఇక మిగిలింది మరో 99 రోజులే అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చారు. అటువంటి తెలంగాణ తల్లి సోనియమ్మను స్వాగతించాల్సింది పోయి.. బీఆరెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీఆరెస్ నేతలు రాజకీయ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే కొట్టి, బిల్లు పేపర్లు చింపేసినా సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. సోనియా గాంధీని గౌరవంగా స్వాగతించి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విజ్ఞత ఉన్నట్టు అనిపించేది. బంట్రోతులు అందరూ చొక్కాలు చించుకుంటున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ విచక్షణ కోల్పోయి వీధి కుక్కల కంటే దారుణంగా దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాము మీటింగ్ పెట్టుకోగానే ఇంట్లో పండుకున్న బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఏకమై కుట్రలు చేశాయని ఆరోపించారు. తమ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు.
“సోనియాగాంధీ తెలంగాణకు రావడంతో బీఆరెస్, బీజేపీ, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయి. బహురూపు వేషాలు వేస్తూ అడ్డుకోవాలని చూశారు. బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం వేర్వేరు కాదు… వీళ్లంతా ఒక్కటే” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
విజయభేరి, సీడబ్యూసీ సమావేశాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. “ఈ నెల 16, 17, 18 దేశ రాజకీయాల్లో చరిత్రాత్మకమైనవి. హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ, కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీ కార్డులను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు ఆ మూడు రోజుల్లో జరిగాయి. ఈ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో విజయవంతం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , ఏఐసీసీ నేతలకు, రాష్ట్ర స్థాయి నాయకులు, కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు. ఈ సందర్భంలో పీసీసీ అధ్యక్షుడిగా నాకు గురుతర బాధ్యతను అప్పగించిన సోనియాగాంధీ గారికి కృతజ్ఞతలు” తెలిపారు రేవంత్ రెడ్డి.
ఇంటింటికి ప్రణాళికలు మారుతున్నట్లె… రాష్ట్రాల అవసరాల్లో తేడాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం,ప్రజల అవసరాలు, అనుగుణంగానే కార్యాచరణ ఉంటుంది మంత్రి హరీష్ రావు వ్యాఖ్యాలకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలని హారీష్ మొండి వాదనలు చేస్తున్నారు. తాటి చెట్టంత పెరిగితే మెదడు మోకాలిలో ఉంటుందని హరీష్ రావుని చూస్తే అర్థమైంది. బుర్ర లేకుండా వితండవాదం చేయొద్దని హరీష్ రావుకు సూచిస్తున్నాను. వెర్రి మాటలు మాట్లాడి తిర్రిగా వ్యవహరిస్తే… ప్రజలు చీరి చింతకు కడతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ధరణిని రద్దు చేస్తామనే హామీని రేవంత్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణలో భూ సమస్య ప్రధానమైంది. భూమి కోసమే సాయుధపోరాటం జరిగింది. అధికారంలోకి వచ్చాక 100 శాతం రద్దు చేసి తీరతామన్నారు. ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం..దొరల ధోరణికి ప్రతిరూపమే ధరణి అని ఆరోపించారు.కేసీఆర్ దోపిడీ పాలనను బొంద పెట్టడం ధరనితోనే మొదలుపెడతామన్నారు. ధరణిని రద్దు చేసి మెరుగైన విధానాన్ని తీసుకొస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
నీళ్ళు నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదు.. అది కేసీఆర్ స్లోగన్ అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని వ్యాఖ్యానించారు. మత విద్వేషాలతో రాజకీయాలు చేసే బీజేపీకి భరతమాత గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ఉద్యమకారులకు భూమి ఇవ్వడం అంటే వాళ్ళని గుర్తించి గౌరవం ఇవ్వడమే అన్నారు. బండి సంజయ్, రాజ్ గోపాల్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై కిషన్ రెడ్డి స్పందించాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.