అహ్మదాబాద్:
అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువం పైకి విజయవంతంగా ల్యాండర్‌ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మరోసారి స్పందించారు..
భవిష్యత్తుల్లోనూ మరిన్ని జాబిల్లి యాత్రలు చేపడతామని చెప్పారు.
గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ”చంద్రయాన్-3 విజయవంతమైంది. దాన్నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నాం. ఇక, జాబిల్లిపై భారతీయుడు అడుగు పెట్టేంత వరకు చంద్రయాన్ సిరీస్ లను కొనసాగించాలని అనుకుంటున్నాం. అంతకంటే ముందు ఇంకా చాలా సాంకేతికత లపై పట్టు సాధించాలి. అక్కడికి వెళ్లి తిరిగి రావడంపై పరిశోధనలు చేయాలి. తదుపరి మిషన్‌లో దీన్ని ప్రయత్నిస్తాం” అని వెల్లడించారు..
భారత్ త్వరలో చేపట్టబోయే గగన్‌యాన్ గురించి సోమనాథ్ మాట్లాడారు. ”దీనికంటే ముందు ఈ ఏడాది ఓ మానవ రహిత మిషన్‌ను చేపట్టనున్నాం. ఏప్రిల్ 24న ఎయిర్ డ్రాప్ వ్యవస్థను పరీక్షించనున్నాం. ఆ తర్వాత వచ్చే ఏడాది మరో రెండు మానవ రహిత యాత్రలను చేపట్ట బోతున్నాం. అన్నీ అనుకూలిస్తే 2025 చివరికి గగన్‌యాన్ ప్రయోగం చేపడతాం” అని పేర్కొన్నారు..
గగన్‌యాన్ మిషన్ కోసం ఇప్పటికే నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE20 క్రయోజనిక్ ఇంజిన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రయోగంతో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూ కక్ష్య లోకి పంపుతారు. ఇందుకోసం ఎల్‌వీఎం-మార్క్3 రాకెట్‌ను ఉపయోగించ నున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమ నౌక సముద్ర జలాల్లో ల్యాండ్ అవుతుంది..