అమరావతి :
యువతను మళ్లీ మోసం చేయడానికే జగన్ మరోసారి కడప స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల కోసమే ఈ డ్రామాకు తెర తీశారని ఆరోపించారు.నెల రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల కోసమే సీఎం జగన్ కడప ఉక్కు కర్మాగారానికి రెండోసారి భూమి పూజ చేసి సరికొత్త డ్రామాకు తెరతీశారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ విమర్శించారు. భూమిపూజ పేరుతో మళ్లీ నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించి ఓట్లు కొల్లగొట్టడానికే ఈ విధంగా చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కడపలో జిందాల్ ఉక్కు కర్మాగారానికి జగన్ భూమి పూజ చేయడంపై ఆయన స్పందించారు. ఓ సినిమాలో ‘చెయ్యాలి చెల్లికి పెళ్లి.. మళ్లీ మళ్లీ’ అని ఓ డైలాగు ఉందని.. సీఎం జగన్ ఆ డైలాగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని రెండోసారి ‘కడప స్టీలు ప్లాంట్’కు భూమి పూజ చేశారని ఎద్దేవా చేస్తూ సత్యకుమార్ వ్యంగంగా ట్వీట్ చేశారు. గతంలో వైఎస్సార్ ఒకసారి, చంద్రబాబు ఒకసారి జగన్ మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మూడో సారి భూమి పూజ చేశారని అన్నారు.సీమ యువతకు ‘మళ్లీ మళ్లీ మోసం’ జరుగుతూనే ఉందన్న ఆయన.. నెల రోజుల్లో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్ల కోసం ఆడుతున్నదే ఈ సరికొత్త డ్రామానే అని విమర్శించారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యడం, నమ్మించి నయవంచనకు పాల్పడడం జగన్నాటకంలో భాగమన్నారు. సీమ యువతా..! మళ్లీ మళ్లీ మోసపోదామా? అని ప్రశ్నించారు.