న్యూఢిల్లీ:
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్చి 3వ తేదీన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మార్చి 9వ తేదీన దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది.
ఈ మేరకు ఈసీ షెడ్యూల్ ప్రకటనకు రెడీ అవుతున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో 3న మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుండటం కీలకంగా మారనుంది. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు లోకి వస్తుంది. ప్రభుత్వాలు విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశముండదు. దీంతో 3న జరిగే కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఢిల్లీ లోని చాణక్యపురి లోని సుష్మా స్వరాజ్ భవన్ లో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు జరుగుతున్న ఈ సమావేశం కీలకంగా మారింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ లకు ఈ ఏడాది మే లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఈ రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కేబినెట్ లో కీలక నిర్ణయాల తీసుకునే అవకాశం లేక పోలేదు.
2014 లోక్ సభ ఎన్నికల ప్రక్రియ మార్చి 5వ తేదీన ప్రారంభమవ్వగా.. మే 16న ఫలితాలు వెలువడ్డాయి. తొమ్మిది విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మార్చి 10న స్టార్ట్ అవ్వగా. మే 23న కౌంటింగ్ జరిగింది. అప్పుడు ఏడు విడతల్లో ఎన్నికలు జరిపారు. వాటిని బట్టి చూస్తే మార్చి 10 లోపు ఈ సారి ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈసీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అధికారులతో ఎన్నికల నిర్వహణపై చర్చించింది. ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దిశా నిర్దేశం చేసింది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సూచనలు చేసింది. దీంతో మార్చిలో ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం వుండటంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. దేశం లోని పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్దమవు తున్నాయి. త్వరలో ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించ నుండగా.. రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. అటు ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికలపై స్పీడ్ పెంచాయి. బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రజలకు ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి.
మరోవైపు లోక్ సభ ఎన్నికలపై సర్వేల హడావుడి కూడా మొదలైంది. పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు సర్వే సంస్థలు ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మరోసారి బీజేపీకే సర్వేలు పట్టం కడుతుండగా.. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి కాంగ్రెస్ సీట్లు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీల బలం కూడా ఈ సారి ఎన్నికల్లో పెరుగుతుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి.