వెంకయ్య నాయుడుకు ‘పద్మవిభూషణ్’

శ్రీ వెంకయ్య నాయుడు గారికీ హృదయపూర్వక అభినందనలు

•పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు

భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన శ్రీ వెంకయ్య నాయుడు గారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవి. కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలందించారు. రాజకీయ ప్రస్థానంతోపాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీ వెంకయ్య నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను.
తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుంచి కళా, సాహిత్య రంగాల నుంచి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం సంతోషకరం. మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమా మహేశ్వరి గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళాకారుడు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీ వేలు ఆనందాచారి గారు, బుర్ర వీణ వాయిద్యకారుడు శ్రీ దాసరి కొండప్ప గారు, సాహిత్య విభాగం నుంచి శ్రీ కేతావత్ సోంలాల్ గారు, శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక కావడం ఆనందదాయకం. వారికి నా అభినందనలు.

(పవన్ కళ్యాణ్)
అధ్యక్షులు – జనసేన

పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest