తిరుపతి :
శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి, శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద్య నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటిని చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలను వైఖనస ఆగమయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలసూక్తం, విష్ణుసూక్తం, దశ శాంతి మంత్రములు, తైత్తరీయ ఉపనిషత్తు, దివ్య ప్రభందములో అభిషేక సమయంలో అనుసంధానము చేసే నిరాట్టమ పాశురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒకో క్రతువులో ఒక మాల వంతున మొత్తం ఏడు రకాల మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఇందులో కురువేరు (వట్టివేరులో ఒకరకం), వట్టివేరు, రోజా, మల్లె, సంపంగి, గులాబి, దవణం, తులసి మాలలు స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. కాగా సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డోప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.