ప్రముఖ చలనచిత్ర, టీవి నిర్మాత, రచయత వి. మహేశ్ (85) శనివారం రాత్రి గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. ‘మాతృమూర్తి’ చిత్రంతో 1975 లో వి. మహేశ్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.వి. రాజేంద్ర కుమార్ సోదరుడే మహేశ్. ఎన్టీఆర్ కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మనుష్యులంతా ఒక్కటే’ (1976) చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడమే కాకుండా దానికి మూలకథను అందించింది వి. మహేశ్. ఆ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’ (1981), చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ‘సింహపురి సింహాం (1983), సుమన్, బోయిన సుబ్బారావు కాంబినేషన్ లో ‘ముసుగు దొంగ’ (1985) చిత్రాలను నిర్మించారు. అలానే కిరణ్ జ్యోతి ఆర్ట్స్ బ్యానర్ పై భూమయ్యతో కలిసి ‘భగత్’ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రసారమైన ‘హరి భక్త కథలు’ ధారావాహికకు ఆయనే నిర్మాత, రచయిత. ఈ ధారావాహికలో భాగమైన ‘విప్రనారాయణ’ కు 2009 సంవత్సరంలో ఉత్తమ మెగా సీరియల్ గా బంగారు నందితో పాటు మూడు విభాగాలలో నంది పురస్కారాలను అందుకున్నారు. తన అన్నయ్య, ప్రముఖ కళాదర్శకుడు వి.వి. రాజేంద్ర కుమార్ తో కలిసి చిత్రాలకు ప్రచార సామగ్రిని తయారు చేసే ‘రూప కళ’ సంస్థను, చిత్ర నిర్మాణ సంస్థ ‘ఆదిత్య చిత్ర’ను నెలకొల్పారు. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా కోరుతురు. అవివాహితుడైన వి. మహేశ్ మృతి పట్ల తెలుగు సినిమా, టీవీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. వి. మహేశ్ అంత్యక్రియలు చెన్నయ్ లో సోమవారం జరుగనున్నాయి. నిర్మాత, రచయిత స్వర్గీయ మహేశ్ అంత్యక్రియలు సోమవారం చెన్నయ్ లో జరుగుతాయని ఆయన మేన్లలుడైన టెలివిజన్ నిర్మాత, దర్శకుడు మహీధర్ వల్లభనేని తెలిపారు.