- జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్
విశాఖపట్నం :
ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్ జవహర్ రెడ్డి వర్సెస్ జనసేన నేత, జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ ఇద్దరి సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. జవహర్ రెడ్డి కుమారుడు ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని మూర్తి మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చట్టబద్దంగా తీసుకునే ఎటువంటి చర్యలకైనా తాను సిద్దంగా ఉన్నానన్నారు. మే 13, 20 తేదీల్లో విశాఖపట్నం వచ్చినట్లు సీఎస్ స్పష్టం చేశారని, మరి మే 9న విశాఖపట్నం నగరానికి ఆయన ఎందుకు వచ్చారని సందేహం వ్యక్తం చేశారు. ఒకవేళ స్నేహితుల వివాహానికి వస్తే భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీక్షకు ఎందుకు వెళ్లారని సీఎస్‌ను మూర్తి యాదవ్ ప్రశ్నించారు.
నిజమే..కొట్టేశారు : ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రాష్ట్రంలో 26 జిల్లాలుంటే ఉత్తరాంధ్రకు మాత్రమే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. భోగాపురం పరిసర గ్రామాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు ముందుగానే ఇచ్చారని గుర్తు చేశారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలీలో సుమారు 700 ఎకరాల వరకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జీవో 596 ద్వారా వేల కోట్ల రూపాయిల కుంభకోణం జరిగిందని మరోసారి ఆరోపించారు. సీఎస్ కుమారుడు ఆధ్వర్యంలోనే ఈ భూ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా ఐఏఎస్‌లు, వైసీపీ నేతలే ఈ భూములను ప్రధానంగా కొట్టేశారని విమర్శించారు. సర్వాధికారాలు కలిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రైతుల వద్ద నుంచి భూమి మారలేదని చెప్పగలరా? ఈ భూములపై జరిగిన రిజిస్ట్రేషన్స్ రద్దు చేయగలరా? అని జవహర్ రెడ్డికి మూర్తి యాదవ్ ప్రశ్నలు సంధించారు.
సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించండి : ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సీఎస్‌గా సర్వాధికారాలు కలిగి ఉన్నారన్నారు. ‘మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పోనీ సీబీఐ ఎంక్వైరీ అయినా వేయించగలరా?. నేను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. అందుకు నా వద్ద రుజువులు సైతం ఉన్నాయి. నేను చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తే సీఎస్ జవహర్ రెడ్డి కాళ్లు పట్టుకొని, మీడియా ముందు క్షమాపణ చెబుతానని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.