”హరి హర వీర మల్లు” ఇంకెన్నాళ్లు ? Hari Hara VeeraMallu…Inkennallu?

పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మాతగా సెప్టెంబర్ 2020లో షూటింగ్ ప్రారంభమైన సినిమా ”హరి హర వీరమల్లు”. గత నాలుగైదేళ్లుగా ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నారు. సినిమా షూటింగ్ ముహూర్తం బాగాలేకనో, పవన్ కళ్యాణ్ సమయం కేటాయించకనో, లేక పాపం నిర్మాత దగ్గర డబ్బులు లేకనో …. కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ సినిమా ఇన్ని సంవత్సరాలు కొనసాగడం ఆయన కెరీర్ లోనే ఇది ప్రథమం. నిజానికి ఈ సినిమా చాలా రోజుల పాటు ఆగిపోయిందని ఫిలిం నగర్ టాక్.


పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. మొదటి భాగం “హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. “ధర్మం కోసం యుద్ధం” అనేది ఉపశీర్షిక.దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇప్పటికే “కంచె”, “గౌతమిపుత్ర శాతకర్ణి”, “మణికర్ణిక” వంటి చిరస్మరణీయ విజయవంతమైన చిత్రాలను అందించారు. “ఎనక్కు 20 ఉనక్కు 18”, “నీ మనసు నాకు తెలుసు”, “ఆక్సిజన్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు “నట్పుక్కాగ”, “పడయప్ప” వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత-దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.’హరి హర వీర మల్లు’ చిత్రాన్ని 2024 చివర్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest