- హాల్ టిక్కెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ
అమరావతి :
ఈ నెల 3 నుంచి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు రవాణా సదుపాయం కల్పిస్తోంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది.
పదో తరగతి పరీక్షల సందర్భంగా బస్సులు ఎక్కువగా తిప్పాలని ఆర్టీసీ అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈమేరకు పది పరీక్షల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6.15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆరా తీశారు. పరీక్షలలో కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, ఆర్డీవోలు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను రోజూ సందర్శించాలని ఆదేశించారు.