అమరావతి :
‘‘తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్యసాయిజిల్లా, పెనుగొండ నియోజకవర్గంలో 55వ రోజు 700కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్ తన పాదయాత్రలో గమనించిన అంశాలపై తన మనసులో మాటను విలేకరులతో పంచుకున్నారు. ఆ విషయాలు ఇలా ఉన్నాయి’’
ప్రశ్న:పాదయాత్రకు ముందు లోకేష్ కి, పాదయాత్ర చేస్తున్న లోకేష్ కి తేడా ఏంటి?
లోకేష్: టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలయ్యాయి, ప్రజలు వాటి పట్ల ఆనందంగా ఉన్నారా, లేరా? అనేది ప్రస్తుతం నేను గమనిస్తున్నారు. ఉదా: మేము రజకులకు వాషింగ్ మెషీన్లు ఇచ్చాం. కానీ వాళ్లు కరెంటు బిల్లు ఎక్కవుగా వచ్చి ఇబ్బంది పడుతున్నారనే విషయం మాకు గతంలో తెలియదు. ప్రస్తుతం వాళ్లు కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. దీన్ని బట్టి రజకులకు 500యూనిట్లు వరకు విద్యుత్ బిల్లులో సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం. ఇలా ప్రతి పథకంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారాలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నాను.
ప్రశ్న: పాదయాత్రలో మహిళలు, వృద్దులు, యువత, పిల్లలు, రైతులను కలుస్తున్నారు. వారి వద్ద మీరు గమనించిన ప్రధాన సమస్యలేంటి?
లోకేష్: రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య. విచ్చల విడిగా సాగుతున్న గంజాయి సరఫరా రెండో ప్రధాన సమస్య. మహిళలను నిత్యావసరాల ధరలు విపరీతంగా వేధిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పన్నుల భారం ప్రజలపై మోపడంతో ఇబ్బందులు పడుతున్నారు.
ప్రశ్న: పాదయాత్రలో మీ మనసును కలిచివేసిన ఘటన ఏంటి?
జవాబు: ప్రధానంగా రెండు ఘటనలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. మొదటిది సత్యవేడు నియోజకవర్గం దాటుతూ ఉండగా చివరి 200మీటర్లలో ఓ మహిళ బోండాలు తయారుచేసి అమ్ముతోంది. ఆమె వద్దకు వెళ్లి మన ప్రభుత్వం వచ్చాక ఏం కావాలని కోరుకుంటుందో అడిగాను. ఆమె మాట్లాడుతూ ‘‘నేను చిన్న హోటల్ నడుపుతూ నా కొడుకులు ఇద్దర్నీ చదివించాను. వాళ్లకు నేడు ఉద్యోగాలు లేవు. వాళ్లకు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగాలిప్పించండి’’ అని కోరింది. రెండవ ఘటన పలమనేరులో మిస్బ ఆత్మహత్య. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సాగిస్తున్నారు. వైసీపీ నాయకుడు సుధాకర్ కూతురికి రెండవ ర్యాంకు, మిస్బకు మొదటి ర్యాంకు వస్తోందనే కారణంతో మిస్బకు బలవంతంగా టీసీ ఇచ్చి పంపేయడంతో ఆ చెల్లి ఆత్మహత్య చేసుకుంది. తాను బాగా చదువుకోవాలని, డాక్టర్ కావాలని తన డ్రాయింగ్ పుస్తకంలో రాసుకున్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత చాలా బాధపడ్డాను.
ప్రశ్న: పాదయాత్ర చేస్తున్నప్పుడు సాధారణంగా కాళ్లనొప్పులు వస్తాయి. కానీ మీ కాళ్లనొప్పులు మర్చిపోయేంత ఆనందాన్ని కలిగించిన ఘటనలు ఏమైనా ఉన్నాయా?
లోకేష్: నేను పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉండగా ఓ మహిళా ఉద్యోగి నా వద్దకు వచ్చి నన్ను ఆప్యాయంగా పలకరించింది. తాను మాట్లాడుతూ గతంలో నేను ఇంటిని చూసుకునేదాన్ని, కంపెనీలు మా ప్రాంతానికి రావడంతో నేను ఉద్యోగం చేస్తున్నాను. మా పిల్లల్ని, ఇంటిని చాలా చక్కగా చూసుకోగలుగుతున్నానని చెప్పడంతో నా మనసు ఆనందంతో ఉప్పొంగింది. నా కాళ్లనొప్పులు మర్చిపోయాను. మరిన్ని కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే బలమైన కోరిక ఏర్పడింది.
ప్రశ్న: సెల్ఫీ విత్ లోకేష్, సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాలు చేస్తున్నారు. రెండింటిలో మీకు ఏది అంటే బాగా ఇష్టం?
జవాబు: నాకు ఈ రెండు కార్యక్రమాలంటే అమితమైన ఇష్టం. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంతో సామాన్యులను కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకునే అవకాశం కలుగుతోంది. సెల్ఫీ ఛాలెంజ్ తో మేం గతంలో ఏం చాశామో, వైసీపీ ప్రభుత్వం కంపెనీలు, ఫ్యాక్టరీలు తేవడంలో ఎంత విఫలమైందో రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి బాగా ఉపయోగపడుతోంది. నేను ఇప్పటి వరకు అనేక సెల్ఫీ ఛాలెంజ్ లు ప్రభుత్వానికి విసిరాను. దీనిపై ప్రభుత్వం, ఐటీ,పరిశ్రమలు,మౌలికసదుపాయాలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా స్పందించలేదు.
ప్రశ్న: రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య. దీన్ని పరిష్కరించడానికి మీ ప్రణాళిక ఏంటి?
లోకేష్: నిరుద్యోగ సమస్యను మూడు రకాలుగా పరిష్కరించాలి. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలి. గతంలో టీడీపీ పాలనలో 40వేల పరిశ్రమలు తెచ్చి వాటిలో 6లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుంది. భవిష్యత్తులో కూడా పెట్టుబడులు తెచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా చేస్తాం. రెండవది ప్రభుత్వరంగంలోని ఖాళీలన్నీ భర్తీ చేయాలి. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖాళీలన్నీ జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. మూడవది స్వయం ఉపాధి ద్వారా యువతకు జీవనోపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అంతేగాకుండా వ్యాపార రంగంలో ఆసక్తి ఉన్న యువతకు ప్రభుత్వం అండగా నిలిచి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.
ప్రశ్న: ప్రత్యక్షంగా 25వేల మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన కియా కంపెనీ ప్రస్తుతం మీ ముందు ఉంది. ఈ కంపెనీ కోసం చాలా రాష్ట్రాలు పోటీపడ్డాయి. కానీ ఏపీకే ఎలా తీసుకువచ్చారు? అది ఎలా సాధ్యమైంది?
లోకేష్: చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. విజనరీకి మారుపేరు చంద్రబాబు అని గూగుల్ లో వస్తుంది. చంద్రబాబు క్యాబినెట్ కూర్పులో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సమర్థులకే ఆయన మంత్రి పదవులు కట్టబెడతారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ గా తీర్చిదిద్దాలనేది మా ఉద్దేశం. అలాగే కడపకు ఉక్కు ఫ్యాక్టరీ. కర్నూలుకు సిమెంట్ ఫ్యాక్టరీ. చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ. ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్. గుంటూరు, కృష్ణాకు రాజధాని ఉంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఫిషరీస్, ఫార్మా, డిఫెన్స్ డెవలప్ మెంట్. ఉత్తరాంధ్రకు ఐటీ. ఇలా అన్ని జిల్లాలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుది. రాజధాని ఒక్కటే ఉండాలి…అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది మా నినాదం. కియా, టీసీఎల్, ఫాక్స్ కాన్, డిక్సన్, సెల్ కాన్, అదానీ డేటా సెంటర్, డిఫెన్స్ అకాడమీ, అదానీ డేటా సెంటర్ ఏదీ రాజధానిలో లేవు. చంద్రబాబు మరోసారి వెంటనే సీఎం అయి ఉంటే మరో 5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీలు వచ్చేవి. కియా పరిశ్రమ వల్ల ఉమ్మడి అనంతపురంజిల్లా తలసరి ఆదాయం రూ.30వేలు పెరిగింది. ఇంకా ఎన్నాళ్లు ఉపాధి, ఉద్యోగాలు కోసం కర్నాటక, తమిళనాడు, తెలంగాణ వైపు మనం చూడాలి? మనం ఎందుకు నంబర్ వన్ కాకూడదు? ఇది చంద్రబాబు నినాదం. అందుకే కియాను ఏపీకి తెచ్చి చూపించారు.
ప్రశ్న: టీడీపీ పాలనలో వచ్చిన కియా కంపెనీ వద్ద మీ పాదయాత్ర 700కిలోమీటర్లు పూర్తిచేశారు. ఆ కంపెనీ లోగో చూస్తుంటే మీ అనుభూతి ఏంటి?
లోకేష్: కియా కంపెనీ లోగో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. లోగో చాలా చిన్నగా ఉండొచ్చు…కానీ దాన్ని తీసుకురావడం వెనుక చాలా కష్టం ఉంది. అనంతపురంజిల్లా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. కియా పరిశ్రమను పెట్టాం. అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? అని చాలా బాధపడ్డాను. అందుకే నేను సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకున్నాను. దీని ద్వారా మేం ఏం చేశాం? వైసీపీ ఏం చేసింది? ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. పెనుగొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయనే సంగతి నేను చూసేవరకు కూడా నాకూ పెద్దగా అవగాహన లేదు. కానీ వాటిని చూశాక ఇన్ని వందల కంపెనీలు ఇక్కడున్నాయా? అని నేను ఆశ్చర్యపోయాను. టీడీపీ బలం సమర్థవంతంగా పనులు చేయడం. చేసిన పనులను చెప్పకోలేకపోవడం బలహీనతగా గుర్తించాం. అందుకే పాదయాత్ర ద్వారా టీడీపీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం.
ప్రశ్న: ఒక్క రాజధానితో రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు. మూడు రాజధానులతో సాధ్యం అని అధికారపార్టీ అంటోంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి?
లోకేష్: మూడు రాజధానులను వైసీపీ ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికి మూడేళ్లు అయ్యింది. ఇప్పటికైనా ఈ మూడు రాజధానుల్లో ఒక్క ఇటుక అయినా వాళ్లు పెట్టారా? లేదు. కానీ మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేదు. కియా పరిశ్రమను జగన్ రెడ్డి తన పాదయాత్రలో చూసి ఫేక్ కంపెనీ అని విమర్శించారు. జగన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇది ఫేక్ కంపెనీనా? నిజమైన కంపెనీనా? రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి చెప్పేవి అబద్దాలా? నిజాలా? తెలుసుకోవాలి.(మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డితో కలిసి కియా కంపెనీ వద్ద సెల్ఫీ దిగి ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అదేవిధంగా కియా కంపెనీలో తయారైన ఓ కార్ ముందు కూడా లోకేష్ సెల్ఫీ దిగి ఛాలెంజ్ విసిరారు.) కియా కంపెనీని ఫేక్ అంటున్న వైసీపీ వాళ్లు తిక్కలోళ్లు అని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.
ప్రశ్న: అన్ని రంగాల్లో ఏపీ ముందంజలో ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి?
లోకేష్: వైసీపీ ప్రభుత్వం రెండు రంగాల్లో ముందంజలో ఉంది. హత్యలు, గంజాయి సరఫరాలో వైసీపీ ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉంది. పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం చివరిస్థానంలో ఉన్నారు.
ప్రశ్న: టీడీపీ ప్రభుత్వం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది?
లోకేష్: టీడీపీ పొత్తు ప్రజలతోనే ఉంటుంది. ప్రజల సమస్యలను టీడీపీ తెలుసుకుంటోంది. వారి సమస్యలపై పోరాడుతోంది. ఎన్నికలు సమీపించే సమయంలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.
ప్రశ్న: ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి టీడీపీ సిద్ధంగా ఉందా?
లోకేష్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది. జగన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చిన తర్వాత మాత్రమే ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడగాలని, ప్రజలు కూడా జగన్ రెడ్డిని నిలదీయాలని కోరుతున్నాం.
ప్రశ్న: టీడీపీ పాలనలో రూ.6లక్షల కోట్ల అవినీతి జరిగింది. పింక్ డైమండ్ ను లోకేష్ దోచుకున్నాడు. అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బంతా ఎక్కడ దాచారు?
లోకేష్: దోపిడీ సొమ్ము అంతా జగన్ రెడ్డి ఇంట్లో ఉంటుంది. టీడీపీ పాలనలో అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారే తప్ప, నిరూపించలేకపోయారు. అంటే మేం అవినీతికి పాల్పడలేదని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. జగన్ రెడ్డి దోచుకున్న డబ్బుతో బుల్లెట్ ఫ్రూప్ కారుల్లో తిరుగుతున్నారు.
ప్రశ్న: వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబు, లోకేష్ చంపించారని వైసీపీ నాయకులు నేటికీ ఆరోపిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి?
లోకేష్: ఒక అబద్దాని వెయ్యిసార్లు చెబితే ప్రజలు నమ్ముతారనేది వైసీపీ నమ్ముకున్న సిద్ధాంతం. సొంత బాబాయ్ ని చంపిన జగన్ రెడ్డి మాపై ఆరోపణలు చేస్తున్నాడు. అధికారంలోకి రాకముందు సీబీఐ విచారణ కావాలని కోరి, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణను విరమించుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. నేడు సీబీఐ విచారణలో జగన్ రెడ్డి, భారతీరెడ్డిల సహాయకులు, అధికారులు కూడా హాజరయ్యారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన అంశాలన్నీ జగన్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. దీన్నిబట్టి రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే వివేకానందరెడ్డిని ఎవరు చంపారో అర్థమైపోయింది. మనం చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రశ్న: ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తున్నారు. వాటిని అమలు చేయడం సాధ్యమేనా?
లోకేష్: నేను ఇచ్చే హామీని అమలు చేయడం నూటికి నూరుశాతం సాధ్యం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత. ఆర్థికపరమైన అంశాల గురించి మేం ఆలోచించం. ప్రజల సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనేదే మా ఆలోచన. ఇచ్చిన ప్రతి హామీని ఎలా నెరవేర్చాలో మాకు స్పష్టత ఉంది.
ప్రశ్న: 55రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులను ఏమైనా గమనించారా?
లోకేష్: యువగళం పాదయాత్రకు యువత పెద్దఎత్తున వస్తున్నారు. పార్టీలో వాళ్లు అధికంగా భాగస్వామ్యమవుతున్నారు. పార్టీలో యువతను పెద్దఎత్తున ప్రోత్సహించాలనే అంశాన్ని మేం గమనించాం. ఈ అంశాన్ని రానున్న కాలంలో అమలు చేస్తాం.
ప్రశ్న:వైసీపీ పాలనలో దళితులపై దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి. మీరు అధికారంలోకి వచ్చాక దళితులకు మీరు ఏం భరోసా ఇస్తారు?
లోకేష్: వైసీపీ పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. విపరీతంగా దళితులపై దాడులు పెరిగిపోయాయి. కఠినతరమైన చట్టాలను సైతం వైసీపీ వాళ్లు తమ చుట్టాలుగా మార్చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడు సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపి డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబు బెయిల్ పై జైలు నుండి బయటకు వస్తే వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనంతబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ సుధాకర్ తో మొదలుకుని తాజాగా పులివెందులలో వెటర్నరీ డాక్టర్ అచ్చన్న వరకు దళితులపై దమనకాండ కొనసాగిస్తూనే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై చేయి వేయాలంటే భయపడే విధంగా కఠినతరంగా చట్టాలను అమలు చేస్తాం. దళితులకు టీడీపీ అండగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాం.
ప్రశ్న: లోకేష్ కి పాదయాత్ర చేయడానికి ఏం అర్హత ఉంది? అని అధికారపక్షం ప్రశ్నిస్తోంది. దానికి మీ సమాధానం ఏంటి?
లోకేష్: గత నాలుగేళ్లుగా వైసీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల కంటే రెండున్నరేళ్లు నేను మంత్రిగా చేసిన పనులే ఎక్కువ. వందల కొద్దీ కార్యక్రమాలు మేం గతంలో చేశాం. రానున్న కాలంలో కూడా చేస్తాం. మేం చేసిన పనుల్లో చంద్రబాబు బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది.