రాజకీయ పరీక్షలో ఐఏఎస్ -ఐపీఎస్ ల ఎదురీత ?

  • తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో మాజీ కలెక్టర్
  • నాగర్ కర్నూల్ లో ఆర్ ఎస్ పీ భారీ స్కెచ్
  • రాజకీయ పరీక్షల్లో నెగ్గేదెవరు ? ఇంటిదారి పట్టేదెవరు?

హైదరాబాద్ :
ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) పరీక్షలు రాసి మంచి ర్యాంకుల్లో పాస్ అయిన వెంకట్ రామిరెడ్డి(Venkatramireddy), ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveenkumar) ఇప్పుడు రాజకీయ పరీక్ష రాస్తున్నారు. సుమారు నలభై ఏళ్లపాటు విధులు నిర్వహించిన ఈ ఇద్దరు బ్యూరోక్రాట్స్ ఇప్పుడు బి ఆర్ ఎస్ (BRS) పార్టీ తరపున రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వెంకట్ రామిరెడ్డి తొలిసారిగా రాజకీయ పరీక్ష రాస్తున్నారు. ఆర్ ఎస్ ప్రవీణ్ ఇంతకుముందు ఒకసారి ఎమ్మెల్యే పరీక్ష రాసి ఫెయిల్ అయ్యారు. ఐఏఎస్ , ఐపీఎస్ పరీక్షలు వాళ్ళు ఈజీగానే రాసి ఉండొచ్చేమో కానీ రాజకీయ పరీక్షలు అంత ఈజీగా ఉండవన్న విషయం వాళ్లకు స్పష్టమవుతోంది. ఇద్దరు ఉన్నతాధికారులు తమ భవిష్యత్తును రాజకీయాల్లో వెతుక్కుంటున్నారు. వెంకట్ రామిరెడ్డి మెదక్(Medak) ఎంపీగా పోటీ చేస్తుంటే, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ (Nagarkurnool) ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ఒకేపార్టీ బి ఆర్ ఎస్ నుంచి పోటీ చెయ్యడం విశేషం.

మెదక్ జిల్లాకు కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అధికారి వెంకట్ రామిరెడ్డి ఇప్పుడు అదే జిల్లాలో పోటీ చేస్తున్నారు. ఈయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, కాంగ్రెస్ నుంచి నీలం మధు తలపడుతున్నారు. వెంకట్ రామిరెడ్డి ఐఏఎస్ అధికారి అయితే, రఘునందన్ రావు న్యాయవాది. వీరిద్దరితో పోల్చుకుంటే నీలం మధు విద్యలో తక్కువే. కానీ ఈ ముగ్గురు కూడా ఆర్థిక పరంగా బలంగా ఉన్నవాళ్లేనని మెదక్ ప్రజలు చర్చించుకుంటున్నారు. వెంకట్ రామిరెడ్డి (venkatramireddy) ఒకపక్క కలెక్టర్ ఉద్యోగం ఎలగబెడుతూనే హైదరాబాద్ లో భారీగా రియల్ ఎస్టేట్ (Realestate) వ్యాపారం చేసి కోట్లు గడించారని ఇక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ (collector)గా ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను త్వరగా కట్టించిన ఘనత వెంకట్ రామిరెడ్డికే ఉన్నప్పటికీ అదే మల్లన్న సాగర్ బాధితులకు తీరని అన్యాయం చేశారనే ఆరోపణలు కూడా వెంకట్ రామిరెడ్డిని వెంటాడుతున్నాయి. కలెక్టర్ హోదాలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు కాళ్ళ మీద పడ్డ వెంకట్ రామిరెడ్డి(venkatramireddy) వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ల పరువు మల్లన్న సాగర్ (Mallannasagar)లో కలిపేశారనే విమర్శలు తీవ్రంగా వచ్చాయి. కానీ ఆ ఆరువాత జరిగిన పరిణామాలు కేసీఆర్ ఆయన్ను ఎం ఎల్ సి పదవి ఇచ్చి మండలికి పంపించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో దిగారు. అయితే బి ఆర్ ఎస్ కార్యకర్తలు పూర్తిగా సహకరించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఒక సామజిక వర్గం వెంకట్ రామిరెడ్డికి పని చెయ్యడం లేదనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఒక పెద్ద నాయకుడు రెడ్డిగారితో సరిగ్గా ఉండటం లేదని వినికిడి. దీంతో వెంకట్ రామిరెడ్డి గెలుపు నల్లేరు మీద నడకలా తయారయిందని చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో కూడా గులాబీ నేత వెనకబడ్డారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.ఇక్కడ కారుకు సరైన దారి దొరకరం లేదని తెలుస్తోంది. దీంతో వెంకట్ రామిరెడ్డికి ఎదురీత తప్పడం లేదనే చెప్పాలి.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveenkumar) అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రాజకీయ పరీక్షా రాసి ఘోరంగా ఫెయిల్ అయ్యారు. బహుజన సమాజ్ పార్టీ(BSP) తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన సిర్పూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈయన సొంతంగా సృష్టించిన స్వేరో అనే ఓ సంస్థ కూడా ప్రవీణ్ కోసం పని చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచి ఓడిపోయిన ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బి ఎస్ పీ ని వదిలేసి బిఆర్ ఎస్ లో చేరారు. కేసీఆర్ (KCR) సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో బీఎస్పీని మోసం చేశారని, బహుజనుడు అయి ఉండి బహుజన పార్టీని మోసం చేశారనే విమర్శలు ఆర్ ఎస్ పీని చుట్టుముట్టాయి. ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రకటించిన మాయావతికి సైతం హ్యాండ్ ఇచ్చాడని బీఎస్పీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. గులాబీ కండువా కప్పుకుని నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో ప్రచారం చేస్తుంటే బిఎస్పీని ఎందుకు వదిలేశారు ? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.ఈయన కూడా బాగానే సంపాదించాడని, బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడే విదేశాల నుంచి కూడా పార్టీ ఫండ్ పెద్ద ఎత్తున ప్రవీణ్ కుమార్ కు వచ్చిందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
సిర్పూర్ జనరల్ సీట్ లో ఓడిపోయిన ప్రవీణ్ కుమార్ (praveenkumar) ఇప్పుడు ఎస్సిలకు రిజర్వ్ అయిన నాగర్ కర్నూల్ (nagarkurnool) స్తానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ ఈయనకు పోటీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , మాజీ ఎంపీ డాక్టర్ మల్లు (Malluravi)రవి పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీ రాములు కుమారుడు భరత్ (Bharath) తలపడుతున్నారు. ఇక్కడ ప్రవీణ్ కుమార్, భరత్ ఇద్దరు కూడా మాదిగ (Madiga) సామజిక వర్గానికి చెందిన వారు కాగా, మల్లు రవి మాల సామజిక వర్గానికి చెందిన వారు. బీజేపీ(BJP), బీఎస్పీ(BSP) ఇద్దరు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మాదిగ సామజిక ఓట్లు ఎటువైపు పడతాయోనని ఇద్దరు నేతలు సందిగ్ధంలో ఉన్నారు. అంతేకాదు బీఎస్పీ నుంచి మాల సామజిక వర్గానికి చెందిన వ్యక్తి బరిలో ఉన్నారు. మాజీ ఎంపీ మంద జగన్నాథంను కాదనుకుని మాల సామజిక వర్గం వ్యక్తికి బీఎస్పీ టికెట్ ఇవ్వడం వెనుక ప్రవీణ్ కుమార్ కథ నడిపించారని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda jagannatham)కు బి ఫామ్ ఇవ్వకుండా, దొడ్డిదారిన మాల సామజిక వర్గానికి చెందిన బెసమొళ్ళ యోసెఫ్ ను రంగంలో దించదానికి కారణం ఇక్కడ మాదిగల ఓట్లు చీలకూడదనే ప్లాన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన కర్నె శీరిష అలియాస్ బర్రెలక్క కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.అయితే సిర్పూర్ లో ఓడిపోవడం, బిఎస్పీని వదిలెయ్యడం వంటి ప్రభావం నాగర్ కర్నూల్ మీద కూడా పడుతోందని గులాబీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక్కడ మల్లు రవికి సొంత సామజిక వర్గం మాలల నుంచి ఎంత మద్దత్తు ఉందొ మాదిగ సామాజిక వర్గం నుంచి కూడా అంతే సపోర్ట్ ఉందని తెలుస్తోంది. దీంతో ప్రధానంగా కాంగ్రెస్, బి ఆర్ ఎస్ మధ్యనే ఇక్కడ పోటీ నెలకొందని చెప్పుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం మల్లురవికి కలిసొచ్చే అంశంగా అని జనం అంటున్నారు. బి ఎస్ ఆర్ అధికారాన్ని కోల్పోవడం ప్రవీణ్ కుమార్ కు మైనస్ అయ్యే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. మరి ఎమ్మెల్యే పరీక్షలో ఇప్పటికే ఫెయిల్ అయిన ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల పోటీలో ఎన్ని మార్కులు తెచ్చుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరు బ్యూరోక్రాట్స్ రాజకీయ పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకుంటారో? లేక ఇద్దరూ ఇంటిదారి పడతారో వేచి చూద్దాం.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest