జోగిపేట
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేట మున్సిపల్ పరిధిలో ప్రముఖ సంఘసంస్కర్త, తత్వవేత్త, మహాత్మ బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ..
మహాత్మా బసవేశ్వరుడు బోధించిన సిద్ధాంతాలు ఆచరణీయమన్నారు. హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో మహాత్మ బసవేశ్వరుడిది ప్రత్యేక స్థానమన్నారు. బసవన్న, బసవుడు గా , విశ్వగురు గా వారు సమాజానికి అందించిన సేవలను, సిద్ధాంతాలను కొనియాడారు. కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయ వాది అని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆందోల్ – జోగిపేట మున్సిపల్ పరిధిలోని లింగాయత్ సమాజం ప్రముఖులు, బసవేశ్వరుని అభిమానులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.