హైదరాబాద్ :
పార్లమెంట్ ఎన్నికల గోల ముగిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై నజర్ పెట్టారు. లోక్ సభ ఎన్నికల హడావిడిలో సుమారు మూడు నెలలపాటు పెద్దగా పాలనపై నజర్ పెట్టని సీఎం ఇప్పుడు తిరిగి పాలనపై ద్రుష్టి పెట్టారు. వరుసగా రెండు రోజుల నుంచి సచివాలయానికి వస్తున్నారు. వివిధ శాఖల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో కొంత గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణ మాఫీపై ముందుగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రైతు రుణ మాఫీ చేసేందుకు ఆగస్టు 15 చివరి తేదీగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. ఆగస్టు లో చెప్పిన సమయానికే రైతు రుణమాఫీ చేస్తామని, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకుని ఉండాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో అనుకున్న సమయానికే రైతు రుణమాఫీ చెయ్యకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా రైతు రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రుష్టి పెట్టారని తెలుస్తోంది. ఇతర పథకాల అమలుకు సంబంధించి కూడా ఆయన ద్రుష్టి పెట్టినట్టు సమాచారం.