సీఎస్ దురాగతాలపై సిబిఐ విచారణ జరపాలి:ఆర్. డి. విల్సన్

విజయవాడ  :

దళిత కార్పొరేషన్ల రద్దుకు, నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి పంపించే దళితుల నిధులు డైవర్ట్ కావడానికి పూర్తి బాధ్యత సీ.ఎస్ జవహర్ రెడ్డి భరించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిజెపి అధికార ప్రతినిధి ఆర్డీవిల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎస్ఆర్ శంకరన్, కాకి మాధవరావు, సుజాత రావు వంటి అధికారులు కష్టపడి రూపొందించిన అసైన్డ్ చట్టం రద్దు వెనక కారకుడు జవహర్ రెడ్డి అని విల్సన్ అన్నారు. జవహర్ రెడ్డి ని సస్పెండ్ చేసి సిబిఐ విచారణ జరపాలన్నారు. ముఖ్యమంత్రి తప్పు చేసినా సరైన మార్గదర్శకత్వం వహించాల్సిన చీఫ్ సెక్రటరీ దళితుల పట్ల వ్యవహరించిన వైఖరి అగ్రకుల అహంభావాన్ని తెలియజేస్తుందని విల్సన్ దుయ్య బట్టారు. దళితుల జీవితాల్లో మార్పు రావడానికి ఉపకరించే భూమి కొనుగోలు పథకం, పండ్ల తోటలు పెంపకం, నర్సరీ ఏర్పాట్లు లిడ్ క్యాప్ ద్వారా చర్మకారులకు ఉపకరించే అనేక పథకాలు రద్దుకు జగన్మోహన్ రెడ్డి ఎంత కారకుడో సిఎస్ జవహర్ రెడ్డి కూడా అంతే కాకూడని జవహర్ రెడ్డి పై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ జరపాలన్నారు. దళితుల భూమి మరి ఎవరికి దక్కకుండా పటిష్టమైన అసైన్ చట్టం తీసుకొస్తే దాన్ని తుంగలో తొక్కడానికి జవహర్ రెడ్డి కూడా ఒక కారకుడు అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పథకాల రద్దు పై గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్న చీఫ్ సెక్రటరీకి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం దళిత వ్యతిరేక భావజాలమే అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థులకు విద్య కు అవకాశం కల్పించలేకపోవడం దగ్గర నుంచి, దళిత విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా గండి కొ ట్టింది జవహరే అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తాను తీసుకొచ్చిన దళిత పారిశ్రామిక విధానానికి కూడా తూట్లు పొడిచింది జగన్, జవహార్ రెడ్డి అన్నారు. దళితులైన డాక్టర్ సుధాకర్ నుండి, మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపేసిన కిరణ్ వరకూ దళితులేనని ఏనాడు వాళ్ళ కుటుంబాల్ని అటు జగన్ రెడ్డి కానీ, ఇటు జవహర్ రెడ్డి సందర్శించలేదని, ఇద్దరి పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. దళితుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసిన అనంతబాబుని జగన్ రెడ్డి వెంటేసుకొని తిరుగుతుంటే అది తప్పని ఏ రోజు జవహర్ రెడ్డి సూచించలేదని, రాజ్యాంగపరంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సూచనలు ఏమీ ఆయన ఇవ్వలేదన్నారు. శిరోముండనం సంఘటనలో వరప్రసాద్ కి మద్దతుగా రాష్ట్రపతి నుండి ఆదేశాలు వచ్చినా జవహర్ రెడ్డి అమలు చేయలేదన్నారు. జవహార్ రెడ్డి దురాగతాలపై బిజెపి అంతర్గత చర్చల్లో తాను చర్చిస్తానని ఈ మేరకు ప్రధాని కూడా లేఖ రాస్తానని అన్నారు. గత ఐదేళ్లుగా అనేక అవకాశాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ లోని దళిత, గిరిజన బహుజనులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాల్సి ఉందన్నారు. గతంలో అమలు చేసిన భూమి కొనుగోలు పథకం నుండి వాహనాల పంపిణీ వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా అమలు చేయాలన్నారు.నమ్మి మోస పోయిన వాలెంటర్లు : జగన్ ప్రభుత్వాన్ని నమ్మి వాలంటీర్లుగా పనిచేసిన చాలా మంది బడుగు వర్గాల యువతతో రాజీనామా చేయించిన జగన్ వైఖరి దారుణమని రాబోయే ప్రభుత్వాలు వాలంటరీగా పని చేసిన వారి జీవితాల్ని కాపాడాలన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest