ప్రతిభాన్వితం వసుంధర భరతనాట్య అరంగేట్రం

 

విజయవాడ  : భారతీయ శాస్త్రీయ నాట్యాలలో  భరత ముని పేరిట ఆవిర్భవించి ప్రసిద్ధి చెందిన దక్షిణాత్యా నాట్యం భరతనాట్యం.  ఆమె తల్లిదండ్రులు ఆనాట్యంపై వల్లభనేని శ్రీలక్ష్మి వసుంధర శ్రద్దాభక్తులతో, అకుంఠిత దీక్షతో కృషి చేసి పూర్తిస్థాయిలో ప్రదర్శననిచ్చిన భరతనాట్యారంగేట్రం ఆహూతులను సమ్మోహితులను చేసింది.  బుడిబుడి నడకలు వేస్తున్న సమయంలోనే పాటలకు గీతాలకు లయాత్మకంగా అడుగులు వేయడం తల్లితండ్రులు డాక్టర్ వల్లభనేని వంశీ, డాక్టర్ పంకజ శ్రీ లు గమనించి వసుంధరకు గత నాలుగు సంవత్సరాలుగా భరతనాట్యం నేర్పిస్తున్నారు. తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం వసుంధర భరతనాట్య అరంగేట్రం నయన మనోహరంగా సాగింది.

వారసత్వంగా వస్తున్న నాట్య సంపదను పరిరక్షించుకుంటూ వస్తున్న కుటుంబాలలో భాగవతుల యజ్ఞనారాయణశర్మ కుటుంబం ఒకటి. వారి కుమారులు భాగవతుల వేంకటరామశర్మ, వారి కుమార్తె సౌమ్యల దగ్గర సుశిక్షణలో వసుంధర నాట్యాభ్యాసం చేస్తూ పూర్తిస్థాయిలో ప్రదర్శననిచ్చి అందరి ప్రశంసలందుకుంది. ఆంగికాభినయం ప్రధానంగా ఏకపాత్ర కేళికతో ఆవిర్భావం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని పోషిస్తూ వసుంధర భరతనాట్యం అంశాలను భావ తాళ లయాత్మకంగా ప్రదర్శించి తన కృషిని ప్రకటితం చేసింది. వసుంధర నాట్య ప్రదర్శన నాట రాగంలో పుష్పాంజలితో ప్రారంభించి చతురస్ర నడకలో అలరింపు, తోడి రాగంలో జతిస్వరం,రాగ మాలికలో సరసిజాక్షులు శబ్దం,
ధన్యాసిలో ఏ మగువ పద వర్ణం, మధ్యమావతి రాగంలో నగుమోము కీర్తన, కామవర్ధిని రాగంలో అష్టపది, అఠాణ రాగంలో థిల్లాన వంటి అంశాలతో ప్రదర్శించి ఆహూతులను సమ్మోహితులను చేసింది. భాగవతుల వేంకటరామశర్మ, భాగవతుల సౌమ్య లు నట్టువాంగం చేయగా గాత్ర సహకారం చిముడూరి సుధా శ్రీనివాస్ అందించార.
వయోలిన్ తో పాలపర్తి ఆంజనేయులు, వీణతో కె శశిధర్, వేణువుతో ఎస్ కె బాబు, మృదంగంతో బి సురేష్ బాబు లు ఆమె నాట్యానికి నిండుదనాన్ని చేకూరుస్తూ సహకరించారు. అదే వేదికపై వసుంధర తనకు భరతనాట్య శిక్షణ నిచ్చిన గురువులకు వేద ఘోష  జరుగుతుండగా సంప్రదాయబద్ధంగా గురు పూజ చేసి ఘనంగా సత్కరించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest