ఐపీఎస్ మరోసారి అభాసుపాలు !

 

హైదరాబాద్ ( 5 మే 2024) :
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి అభాసుపాలయ్యారు. నాగర్ కర్నూల్ లో బి ఆర్ ఎస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసిన ప్రవీణ్ కుమార్ డాక్టర్ మల్లు రవి చేతిలో ఘోరపరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, బి ఎస్ పీ టికెట్ మంద జగన్నాథం కు ఇవ్వకుండా స్కెచ్ వేసి గెలవాలని చూసిన ఓడిపోయారని నగర్ కర్నూల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. సొంత నియోజకవర్గంలో కూడా గెలవలేకపోవడంతో ప్రవీణ్ కుమార్ నాయకత్వంపై ఆశలు సన్నగిల్లుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుంచి నాన్ లోకల్ క్యాండిడేట్ గా సిర్పూర్ లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. బి ఎస్ పీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ తన కొంతమంది అనుచరులతో కలిసి కేసీఆర్ సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరారు. బి ఆర్ ఎస్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేసి మల్లు రవి చేతిలో ఓడిపోయారు. ప్రవీణ్ కుమార్ నమ్ముకున్న స్వేరో టీమ్ సరిగ్గా పని చెయ్యలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎం ఆర్ పీ ఎస్ వర్గం కూడా ప్రవీణ్ కుమార్ ను వ్యతిరేకించాయనే విమర్శలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. బి ఎస్ పీ నుంచి ఒకసారి, బి ఆర్ ఎస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా రెండు సార్లు ఓడిపోవడంతో ఈయన నాయకత్వంపై బాగా దగ్గరగా ఉండే అనుచరులే అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బిజేపీ అభ్యర్థి భరత్, బి ఆర్ ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ ఇద్దరు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇక్కడ కొంత అధిక శాతం ఉన్న మాదిగ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటికే బీజేపీ అభ్యర్థితో ప్రవీణ్ అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నా ఫలితం లేకపోయిందని వినికిడి. ఒకే సామజిక వర్గానికి చెందిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లు చీల్చుకోవడం ద్వారా, మాల సామాజికవర్గం అయిన డాక్టర్ మల్లు రవికి కాంగ్రెస్ ఓట్లు, మాల వర్గం ఓట్లతో పాటు మాదిగ వర్గం ఓట్లు కూడా తోడయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనివల్లే మల్లు రవి సునాయాసంగా విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest