Delhi visit నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ

ఢిల్లీ :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగానే అనుకున్న విధంగా బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను జగన్ కలిశారు. అమిత్ షా నివాసంలో సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు జగన్ విజయవాడకు బయలుదేరుతారని మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ, పర్యటనలో మార్పు చేసుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో కూడా జగన్ భేటీ అయ్యారు. తొలుత నిర్మల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఉదయాన్నే ఏపీ బయల్దేరాలని జగన్ భావించారు.

కానీ, చివరి నిమిషంలో రావాలని జగన్‌కి సీతారామన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం జగన్.. ఆమెతో సమావేశం అయ్యారు. మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్‌ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని నిర్మలను జగన్‌ కోరినట్లు తెలుస్తోంది. కాగా, 15 రోజుల వ్యవధిలో జగన్‌ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన చర్చలు జరిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest